ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి

భూమా కిషోర్ రెడ్డి

ప్రజాశక్తి-ఆళ్లగడ్డ: కడప జిల్లాలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం(జ్యోతి క్షేత్రం) వద్ద అక్రమ కట్టడాలు కూల్చివేయడంపై బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని తాలూకా వైకాపా నాయకులు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రెండు రోజుల క్రితం కడప జిల్లాలోని కాశినాయన ఆశ్రమంలో అక్రమ కట్టడాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు కూల్చి వేయడం జరిగిందన్నారు. 20 సంవత్సరాలకు పైగా కాశిరెడ్డి నాయన ఆశ్రమాల ద్వారా అన్నదాన వితరణ జరుగుతుందన్నారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమాల్లో స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి అన్నదాన వితరణ చేయడం జరుగుతుందన్నారు. అలాంటి క్షేత్రాన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కూల్చి వేయడం జరిగిందన్నారు . సనాతన ధర్మ పరిరక్షకుడని, హిందూ పరిరక్షణ కోసం ఎన్నో చట్టాలు తేవాలని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోనే అటవీ శాఖ ఉందని ఆ శాఖ పరిధిలోని వారే కూల్చివేయడం జరిగిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పారని ఆశ్రమాన్ని తిరిగి నిర్మిస్తామని చెప్పడం జరిగిందన్నారు. దేవాలయాలను పరిరక్షిస్తామని చెప్పి వాటికే శటగోపం పెడితే ఎలా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమత్రి పవన్ కళ్యాణ్ కు తన శాఖల మీదే పట్టులేకుంటే ఎలా అని, కట్టడాల కూల్చివేత ఘటనకు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

➡️