పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సిఎం ?

Jun 10,2024 21:40 #Deputy CM, #JanaSena, #MLA pavan kalyan
  • జనసేనకు 4, బిజెపికి 2
  • 25 మందితో మంత్రివర్గం
  • నేడు కూటమి ఎంఎల్‌ఎల సమావేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, కాకినాడ ప్రతినిధి : టిడిపి కూటమిలో మంత్రివర్గ కూర్పునకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టు తెలిసింది. డటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విడివిడిగా సోమవారం ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు బిజెపి కూడా ఒక జాబితాను సమర్పించింది. విశ్వసనీయ సమాచారం మేరకు పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సిఎం పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణుల నుండి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. పవన్‌తోపాటు, టిడిపిలో వేరేవరికైనా డిప్యూటి సిఎం పదవి ఇస్తారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు మొత్తంమీద జనసేనకు నాలుగు, బిజెపికి రెండు మంత్రి పదవులు ఇస్తారని, 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలసింది. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో కూటమి ఎంఎల్‌ఎల సమావేశం మంగళవారం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలోనే శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారు. మంత్రివర్గ కూర్పునకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకుంటారు. ఏ పార్టీ నుంచి ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారు? ఎవరికి ఏ శాఖలు అప్పగిస్తారనే అంశం కూడా ఈ సమావేశంలోనే ఖరారయ్యే అవకాశం ఉంది. సమావేశం తరువాత కూటమి నేతలు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతిపత్రం అందించనున్నారు. బుధవారం జరగనున్న కార్యక్రమంలో చంద్రబాబుతో పాటే మిగిలిన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు టిడిపిలోని ఆశావహులు చంద్రబాబునాయుడును, లోకేష్‌ను కలుస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

రేపు తిరుపతికి చంద్రబాబు
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చంద్రబాబునాయుడు తిరుపతి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ ఖరారైంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్కు మేధ టవర్స్‌ సమీవంలో బుధవారం ముఖ్యమంత్రిగా 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అక్కడ నుండి నేరుగా తిరుపతి వెడుతారు. రాత్రికి అక్కడే బసచేసి, దర్శనం అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారు.

➡️