పంచాయతీలకు పంద్రాగస్టు నిధుల పెంపు – డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు గ్రామ పంచాయతీలకిచ్చే నిధులను 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, అంతకంటే జనాభా అత్యధికంగా ఉండే పంచాయతీలకు రూ.25 వేలు అందించనున్నట్లు డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు వేడుకల నిర్వహణ కోసం మైనర్‌పంచాయతీలకు రూ.100, మేజర్‌ పంచాయతీలకు రూ.250 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచుతున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఇదే విధంగా రిపబ్లిక్‌ వేడుకల నిర్వహణ కోసం కూడా ఇదే విధంగా నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు డిప్యూటీ సిఎంను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సిఎం తెలిపారు. స్వల్ప మొత్తాలతో వేడుకలను నిర్వహించడం పంచాయతీలకు భారంగా మారిందని వారు పవనకల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ వేడుకలైన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టి పడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్ధులకు ఆగస్టు15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్ధల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్‌, డిబేట్‌ లాంటి పోటీలు నిర్వహించాలన్నారు. పంచాయతీ పరిధిలోని స్వాతంత్య్ర సమర యోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని ,పారిశుద్ద్య కార్మికులను సత్కరించాలని డిప్యూటీ సిఎం సర్పంచ్‌లకు సూచించారు. పారిశుద్ధ్యంపై గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని ఆయన కోరారు.

➡️