- అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు
- మొత్తం నెట్ వర్క్‌ను బ్రేక్ డౌన్ చేస్తాం
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రజాశక్తి కాకినాడ ప్రతినిధి : కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆరోపించారు. కాకినాడ పోర్టును ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి అయ్యే అవకాశమూ లేకపోలేదన్నారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. మొత్తం నెట్‌వర్క్‌ను బ్రేక్ డౌన్ చేయాలని, రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని తెలిపారు. షిప్‌ను సీజ్ చేసి, దీని వెనుక ఎవరున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
పోర్టులో తనిఖీలు
కాకినాడ పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌కల్యాణ్ తనిఖీలు నిర్వహించారు. సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు ప్రత్యేక బోటులో వెళ్లి తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ఇదే షిప్‌లో తనిఖీలు చేసి పట్టుకున్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారనే దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్‌పి రఘువీర్, సివిల్ సప్లయీస్ డిఎస్‌ఒ ప్రసాద్‌పై సీరియస్ అయ్యారు. పోర్టుకు రేషన్ బియ్యం వస్తుంటే పోలీసు శాఖ ఏం చేస్తోందని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు.