ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :2024-25 ఆర్థిక సంవత్సరానికి మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉపాధి హామీ 21.5 కోట్ల పనిదినాలకు వేతనాల చెల్లింపుల కోసం రూ.5,743.90 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆమోదించిన 15 కోట్ల పనిదినాలకు సంబంధించి వేతనాల నిధులు రూ.2,934.80 కోట్లు మంజూరు చేయడంతోపాటు నిధులు కూడా విడుదల చేసిందన్నారు. ఇందుకు అదనంగా ప్రస్తుతం రూ.2,812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్‌టిఒల అప్‌లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుంగా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమవుతాయని పేర్కొన్నారు.
