ప్రజాశక్తి, అమరావతి బ్యూరో:ఈ నెల 14 నుండి 20వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న పంచాయతీ వారోత్సవాలు ‘పల్లెపండుగ’లో భాగంగా రూ.4,500 కోట్ల వ్యయంతో 30 వేల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులను పండుగ వాతావరణంలో చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన పనులకు భూమిపూజ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యకమ్రంలో ఉపాధి హామీ పథకం పనులపై అవగాహన కల్పించడం, వాటి ఉపయోగం, భవిష్యత్తులో వాటి నిర్వహణ అంశాన్ని వివరించాలన్నారు. ప్రతి పంచాయతీలో ఈ ఏడాది పూర్తి చేసిన, చేపట్టబోయే పనుల వివరాలు తెలియజేసే విధంగా సిటిజెన్ నాలెడ్జ్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.