- ప్రతి నియోజకవర్గంలో నగర వనం
- నాగార్జునసాగర్-శ్రీశైలం పరిధిలో పులుల సంరక్షణ జోన్
- వనమహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- పవన్‌కల్యాణ్‌తో కలిసి మొక్కలు నాటిన సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అడవులను విధ్వంసం చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. డ్రోన్ పర్యవేక్షణతో అడవులపై నిఘా ఉంటుందని, హాని తలపెట్టాలని ఎవరైనా అడుగుపెడితే అదే వారికి చివరి రోజు అని వెల్లడించారు. హరితాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరగాల్సిన వనమహోత్సవ కార్యక్రమానికి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ హాజరుకావాల్సి ఉంది. వర్షం కారణంగా ఆ పర్యటన రద్దవ్వడంతో మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉన్న ఎకో పార్కులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చెరొక మొక్కను నాటారు. అనంతరం అక్కడ పాఠశాల విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు కావాలంటే మొక్కలు పెంచాలని చెప్పారు. ప్రకృతి ప్రజల ఆస్తి అని, దానిని అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్క్‌లు, ఒక టైగర్ పార్క్, ఎలిఫెంట్ శాంచ్యురీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం మధ్యలో 5,300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ సంరక్షణ కేంద్రం వస్తుందని చెప్పారు. పవన్‌కల్యాణ్ ఆధ్వర్యాన రాష్ట్రంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నగర వనాలను పెంచుతామని, 2047 నాటికి పచ్చదనంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతామని వెల్లడిం చారు. పవన్‌కల్యాణ్ ప్రతిపాదించిన జపనీస్ టెక్నాలజీ మియావకీ విధానంలో మొక్కలు నాటుదామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మియావకీకి కలిపితే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. ఈ ఏడాది కోటి చెట్లు నాటేలా లక్ష్యం పెట్టుకోవాలని చెప్పారు. దీనివల్ల 0.33 శాతం గ్రీన్ కవర్ పెరుగుతుందన్నారు. చెట్లు ఎక్కువగా నాటిన వారికి ప్రతియేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న అవార్డులు అందిస్తామన్నారు. అడవులను నరికేస్తున్నారని, కొంతమంది కాలువలు, చెరువులను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల కరువు, కాటకాలు, భారీ తుపానులు వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తులను ప్రోత్సహించిందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఇబ్బందులు పెట్టారని సినీనటి కాదంబరి అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
మియావకీ విధానంలో వనాల అభివృద్ధి : పవన్‌కల్యాణ్
జపాన్‌లో అవలంభిస్తున్న మియావకీ అటవీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విధానం తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో అడవుల్ని పెంచడమని చెప్పారు. దీనివల్ల వేగంగా అడవులు, పచ్చదనం పెరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో అడవులను తలపించే వనాలు సిద్ధమవుతాయని వెల్లడించారు. వీటిపై ప్రతి ఒక్కరూ దృష్టిపెడితే ఇందుకు సంబంధించిన విధానాన్ని, సూచనలను ప్రభుత్వం తరపున ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతామన్నారు. చెట్లను పెంచడం బాధ్యతగా తీసుకోవాలని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు నరికేసిందని విమర్శించారు. చెట్టును కూల్చడం తేలికని, అది పెరగడానికి ఏళ్లు పడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భావితరాల కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం పచ్చదనం 29 శాతం ఉందని, దీనిని 50 శాతానికి పెంచాలని కోరారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విత్తనానికి, మనిషి జీవితానికి పోలిక ఉందన్నారు. భూమిని చీల్చుకుంటూ విత్తనం బయటకు వస్తుందని, మనుషులు అలా ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే ప్రతిజ్ఞను మంగళగిరిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని వేదవాణితో చంద్రబాబు, పవన్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏసురత్నం, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, అటవీదళాధిపతి చిరంజీవి చౌదరి, అటవీశాఖ ఉన్నతాధికారులు శాంతిప్రియా పాండే, రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టరు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.