సాగునీటి కాలువలను అభివృద్ధి చేయండి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి-గుంతకల్లు టౌన్‌ : అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచి ఆధునీకరణకు రూ.రెండు వేల కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా పందికోన నుంచి అనంతపురం జిల్లా ఉరవకొండ వరకు హంద్రీనీవా కాలువను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సి ద్వారా సక్రమంగా నీరు వస్తే గుంతకల్లు, ఆలూరు బ్రాంచ్‌ కాలువలకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో హంద్రీనీవా కాలువ ద్వారా 6.04 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. పాలకులు ఈ దిశగా స్పందించడం లేదన్నారు. సాగు నీటి కాలవలను అభివృద్ధి చేయాలని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️