అభివృద్ధి-సంక్షేమం సమపాళ్ళల్లో ప్రజలకు అందాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విజయవాడ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళల్లో ప్రజలందరికీ మేలు జరిగేలా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసరావు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం .. ‘ ప్రజా ప్రణాళిక పై సమాలోచన ‘ చర్చ కార్యక్రమాన్ని శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … భూమి, ఇండ్లను ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌లోకి మార్చారని, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి అయితే మొత్తం అభివృద్ధి అయినట్లు… షేర్‌ మార్కెట్‌ అభివృద్ధి అయితే మొత్తం అభివృద్ధి అయినట్లు చేస్తున్నారని అన్నారు. షేర్‌ మార్కెట్‌ పై జరిగే అభివృద్ధి ఒక గాలిబుడగలాగా ఉంటుందని ఎద్దేవా చేశారు. హిడెన్‌బర్గ్‌ రిపోర్టు వస్తే ఒక్కసారిగా షేర్లన్నీ పడిపోయాయని.. మళ్లీ 3 రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ గెలవగానే ఒక్కసారిగా పెరిగిందని తెలిపారు. అభివృద్ధి అనేది వ్యవసాయంలో, పరిశ్రమల్లో కనపడాలి అని అన్నారు. ఇప్పుడు రాజకీయాలన్నీ కేవలం స్పెక్యులేషన్‌పై ఆధారపడి నడుస్తున్నాయని ఆరోపించారు. ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించామని… వ్యవసాయ నష్టానికి ప్రధాన కారణం తుఫాను కాదని, డ్రైనేజీ సిస్టం లేకపోవడమేనన్నారు. డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి అపార నష్టాన్ని కలిగించిందన్నారు. వాస్తవంగా ఈ సంవత్సరం రైతులకు మంచి దిగుబడి రావల్సి ఉందని.. తుఫాను కారణంగా ధాన్యమంతా పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా హైవేలను కడుతున్నారు కానీ డ్రైనేజీలను ఏర్పాటు చేయలేకపోతున్నారని విమర్శించారు. సంపద పెరగాలని, ప్రజల ఆదాయాలు పెరగాలని కోరుకునేది ఎక్కువగా వామపక్షాలేనన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే పోకూడదన్నారు. ధరలు పెరగకుండా కొనుగోలు శక్తి పెరిగితే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్పొరేట్‌ సెక్టార్‌కు రాయితీలు ఇచ్చేది అభివృద్ధి కాదన్నారు. వారు ఉపాధి కల్పిస్తున్నామనేది కేవలం కాగితాలకే పరిమితమవుతుందని చెప్పారు. సామాన్య ప్రజలపై జిఎస్‌టి భారాలు పెరుగుతుంటే … కార్పొరేట్లకు మాత్రం రాయితీలిస్తున్నారనీ.. వారి రుణాలు కూడా మాఫీ అవుతున్నాయని ధ్వజమెత్తారు. అభివృద్ధి అనే ఎజెండా రాజకీయ విధానాలతో, వివిధ వర్గాల ప్రయోజనాలతో ముడిపడి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళల్లో ప్రజలందరికీ మేలు జరిగేలా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసరావు కోరారు.

ప్రజా ప్రణాళికపై సిపిఎం సమాలోచలో వివిధ రంగాల మేధావులు, ప్రముఖులు పాల్గొని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అభివృద్ధి-సంక్షేమం సమపాళ్ళల్లో ప్రజలకు అందాలని కోరారు. ప్రభుత్వ విధానాలతో రవాణా, నిర్మాణ, పాఠశాల విద్య రంగాలు కుదేలవుతున్నాయని ప్రముఖులు చెన్నుపాటి వజీర్, కొండలరావు, డా.పరిమి, డా.వసుంధర, చలువాది మల్లికార్జునరావు తదితరులు పేర్కొన్నారు. కమ్యూనిస్టులు బలపడాలని వివిధ రంగాల ప్రముఖులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ప్రజా ప్రణాళికను మరింత పరిపుష్టం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చా వేదికలు నిర్వహించాలని వారు కోరారు.

samalochana on praja pranalika

samalochana on praja pranalika1

➡️