ధన్యజీవి వెంకటస్వామి

Feb 13,2024 08:13 #cpm srinivasarao, #ongle district
  •  సంస్మరణ సభలో వక్తలు

ప్రజాశక్తి-పొదిలి : కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరించడంతో పాటు తాను నమ్మిన పార్టీకి వారసత్వాన్ని అందించిన ఘనత వెంకట స్వామికి దక్కుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు, సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు అన్నారు. కెల్లంపల్లి మాజీ సర్పంచ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తండ్రి వెంకటస్వామి సంతాప సభ సోమవారం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రమేష్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మధు మాట్లాడుతూ.. కలరా వ్యాధి ప్రబలి గ్రామాలలో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడిన కష్టకాలంలో కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు వైద్యం నేర్చుకుని పేదలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అభ్యుదయ విలువలు పాటిస్తూ… ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ.. గ్రామంలో సంస్కృతి, సంప్రదాయాలను వెంకటస్వామి పరిరక్షించారన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ.. కట్టుబాట్లతో కునారిల్లుతున్న వెనుకబడిన గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేశారని తెలిపారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌, సిఐటియు రాష్ట్ర నాయకులు కె. సుబ్బరావమ్మ, సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి హనీఫ్‌, సీనియర్‌ నాయకులు వై.సిద్ధయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఎం ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, ఎన్‌టిఆర్‌, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. తమ తండ్రి ఎంతో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ఈ విషాద సమయంలో తనకు, తన కుటుంబానికి సానుభూతి తెలిపిన వారందరికీ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

➡️