పోర్టు ఆస్పత్రి ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖ పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి ప్రయివేటీకరణను మోడీ ప్రభుత్వం నిలిపివేయాలంటూ సిపిఎం ఆధ్వర్యాన సాలిగ్రాంపురంలోని పోర్టు గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. తొలుత సమీప ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రయివేటీకరణ ఆపకుంటే మోడీ సర్కారుకు ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పోర్టు ఆస్పత్రిని పోర్టు నిధులతోనే 300 పడకల మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. పిపిపి పేరుతో ప్రయివేటీకరించడం తగదని, ప్రయివేటీకరణ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పోర్టు సాలీనా సుమారు రూ.300 కోట్లు లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో సుమారు రూ.170 కోట్ల ఆదాయం సమకూరుస్తోందని పేర్కొన్నారు. వేలాది ఎకరాల భూములు కలిగి ఉందని, కార్గో హేండ్లింగ్‌, ఇతర విభాగాల్లో దేశంలో పలు రికార్డులు సాధిస్తూ వస్తోందని గుర్తు చేశారు. ఈ ఘనత సాధనలో సంస్థ ఉద్యోగులు, కార్మికుల పాత్ర విశిష్టమైనదన్నారు. వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, యాజమాన్యానిదని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వం పోర్టు ఆస్పత్రిని సైతం ప్రయివేటుకు కట్టబెట్టేందుకు పూనుకుందని, అందుకు టెండర్లు ఆహ్వానించిందని తెలిపారు. ఇది కార్మిక కుటుంబాల వైద్య హక్కును హరించడమే అవుతుందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, బి.ఈశ్వరమ్మ, బి.పద్మ, యుఎస్‌ఎన్‌.రాజు పాల్గన్నారు.

➡️