- తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్
ప్రజాశక్తి-విఆర్.పురం (అల్లూరి జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్.పురం మండలంలోని పెదమట్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పది రోజులుగా కొనుగోలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఆ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పది రోజులుగా కేంద్రం వద్ద రైతులు ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. గోదావరి వరదల వల్ల విఆర్.పురం మండలంలోని వెంకన్నగూడెం, రామవరం, చొప్పల్లి, మొద్దులగూడెం, గుర్రంపేట, నూతిగూడెం, సున్నంవారిగూడెం తదితర గ్రామాల్లో నాట్లు ఆలస్యంగా వేశారని తెలిపారు. దీంతో పంట రావడం ఆలస్యమైందన్నారు. ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతు నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, కొనుగోలు నిలుపుదల చేయడం తగదని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం ఎండకు ఎండుతుండడం వల్ల రోజురోజుకు రంగు మారే అవకాశం ఉందని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులను సమీకరించి ఐటిడిఎ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం లక్ష్మి, పెద్దమట్టపల్లి సర్పంచ్ వెట్టి లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోయం చిన్నబాబు, రైతులు పాల్గొన్నారు.