హామీల అమలుకు 17న ధర్నా: ఎపి రైతు సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17న విజయవాడలోని ధర్నా చౌక్‌లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎపి రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది ఎన్నికల సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఏడాది గడుస్తున్నా హామీగానే మిగిలిపోయిందన్నారు. అందరికీ సంక్రాంతి వరాలు ఇస్తున్నామని, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని సిఎం గొప్పగా చెబుతున్నారని, రైతులను ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ఆయనకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. గుర్తున్నా రైతులకు ఇవ్వడం ఇష్టం లేక అమలు చేయడం లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో తుపానులు, వరదలతో 6 లక్షల ఎకరాల్లో, రాయలసీమ ప్రాంతంలో కరువుతో 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తుపాను, వరద ప్రాంతాల్లో రైతులకు పరిమితంగానైనా కొంత ఆర్థిక సాయం అందించారని, కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. 2023-24లో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో కరువుతో పంటలు దెబ్బతిన్న రైతులకు సాయం అందించలేదన్నారు. 2024 ఖరీఫ్‌ సీజన్‌లో తుపాను, వరదలు, కరువుతో నష్టపోయిన రైతాంగం మళ్ళీ, మళ్ళీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్‌లో సరైన ధర లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.

➡️