స్టీల్‌ప్లాంట్‌ కోల్‌ విడుదల చేయాలి – గంగవరం పోర్టు వద్ద ధర్నా

Sep 6,2024 21:01 #CITU AP, #CITU Protest, #Coal, #Visakha

ప్రజాశక్తి – ఉక్కునగరం, గాజువాక (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ కోల్‌ను అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం తక్షణం విడుదల చేయాలంటూ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన గంగవరం పోర్టు గేటు వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. గంగవరం పోర్టు అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులు పెద్దపెట్టున నినదించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ.. విదేశాల నుంచి కొనుగోలు చేసిన కోల్‌ గంగవరం పోర్టుకు చేరుకోగా అది స్టీల్‌ప్లాంట్‌ వరకూ చేరకుండా అదానీ యాజమాన్యం, కొంతమంది కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వారికి రావాల్సిన కొద్దిపాటి ఆర్థిక మొత్తాల కోసం రూ.వేల కోట్లతో కొన్న కోల్‌ను అడ్డుకోవడం, కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకుని ఆటంకాలు కల్పించడం దారుణమన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో గంగవరం పోర్టు పూర్తిగా ప్రయివేటుపరం అయిందని వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టు.. స్టీల్‌ప్లాంట్‌తోనే వ్యాపారం చేస్తూ నష్టాలు కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ.. కోల్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే కార్బన్‌ మోనాక్సైడ్‌ గ్యాస్‌ ద్వారానే బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌, మిల్స్‌ వంటి వాటిలో ఉత్పత్తి సాధ్యమన్నారు. ఆ గ్యాస్‌ లేని పక్షంలో ఉత్పత్తి పడిపోవడమే కాకుండా యంత్రాలు మరమ్మతుకు గురవుతాయని తెలిపారు. యూనియన్‌ అధ్యక్షులు వైటి.దాస్‌ మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ సందర్శనలో చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదన్నారు. పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన సహాయ సహకారాలు అందడం లేదని పేర్కొన్నారు. సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు మాట్లాడుతూ… ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 10న జరిగే రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలో ప్రతి ఒక్కరూ పాల్గనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరాజు, కె.గంగాధర్‌, పుల్లారావు, నీలకంఠం, వి.ప్రసాద్‌, మురళి, శ్రీనివాస్‌ రెడ్డి, స్టీల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.శ్రీనివాస్‌, నమ్మి రమణ పాల్గొన్నారు.

➡️