వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధి óహామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఉపాధి కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 12న ధర్నా చేపట్టనున్నట్లు తెలిపింది. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్రమైన అతివృష్టి, అనావృష్టికి తోడు వ్యవసాయ సంక్షోభం, యంత్రాల ప్రవేశపెట్టడంతో గ్రామాల్లో పనులు లేక లక్షల వ్యవసాయ కార్మికులు వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో మిర్చికోత కోసేందుకు కర్నూలు జిల్లా నుంచి సుమారు లక్ష మంది వలస వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని తెలిపారు. ఈ వలసల వల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు వలసల వల్లే రాష్ట్రంలో 1570 మంది చనిపోయారని తెలిపారు. వలసల నివారణ కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం పాలకుల నిర్లక్ష్యం వల్ల సక్రమంగా అమలు జరగడం లేదని పేర్కొన్నారు. ఉపాధి పథకానికి తగిన నిధులు కేటాయించి, ఉపాధి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సహాయ కార్యదర్శి ఈ అప్పారావు, ఉపాధ్యక్షులు కోటా కళ్యాణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అప్పలస్వామి పాల్గొన్నారు.