రాక్‌ సిరామిక్స్‌ కార్మికుల ధర్నా

  • తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

ప్రజాశక్తి – సామర్లకోట(కాకినాడ జిల్లా) : అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ జిల్లా సామర్లకోటలోని రాక్‌ సిరామిక్స్‌ పరిశ్రమ గేటు ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. పరిశ్రమలో 15 ఏళ్లుగా పని చేస్తున్న 25 మంది కార్మికులను ఎటువంటి కారణం లేకుండా అర్ధాంతరంగా తొలగించడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత లాభాలతో నడుస్తున్న రాక్‌ సిరామిక్స్‌ పరిశ్రమ మరింత లాభాలు ఆర్జించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కార్మిక చట్టాలు అమలు చేయకుండా, ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడం సరికాదన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులు చెప్పినా పెడచెవిన పెట్టిందని తెలిపారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకోని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో రాక్‌ సిరామిక్స్‌ వర్కర్లు చంద్రశేఖర్‌, సతీష్‌, రామకృష్ణ, వరప్రసాద్‌, మల్లికార్జునరావు, గంగాధర్‌, క్రాంతి, మంగారావు, అర్జున్‌రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న పాల్గొన్నారు.

➡️