ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఆస్తి విలువ ఆధారిత పన్ను రద్దు చేయాలని, అపార్ట్‌మెంట్ వాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద వార్వా, నివాస్ ఆధ్వర్యాన బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను నాగార్జున యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ వి.బాలమోహన్‌దాస్ ప్రారంభించి మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి అద్దె విలువపై లెక్కించి పెంచాల్సిన ఇంటిపన్ను, క్యాపిటల్ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెనాల్టీలతో లెక్కించి ఏటా పెంచడాన్ని అపార్ట్‌మెంటులు, కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వార్వా, నివాస్ అధ్యక్ష, కార్యదర్శులు పిట్టా నారాయణమూర్తి, బిబి.గణేష్ మాట్లాడుతూ.. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ప్రీపెయిడ్ రీఛార్జ్, పీక్ సమయం, నాన్ పీక్ సమయాల్లో భిన్న రేట్లలో విద్యుత్ బిల్లులు వసూలు చేసి ఆదానికి అప్పగించే విధానాన్ని ఖండించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ ఆస్తులు ప్రయివేటుపరం చేయరాదని, గంగవరం అదానీ పోర్టు వాయు కాలుష్యాన్ని అరికట్టాలని, 24/7 అంటూ అమృత స్కీం పేరుతో నీటి మీటర్లు బిగించి, ఛార్జీలు పెంచరాదని డిమాండ్ చేశారు. 22ఎ భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. హనుమంతవాక, మద్దిలపాలెం, షీలానగర్, పాత గాజువాక, కొత్త గాజువాక తదితర ముఖ్యమైన జంక్షన్లలో ఫ్లై ఓవర్లు, సబ్ వేలు నిర్మించాలని, పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, సర్వీస్ రోడ్డులు, ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కోరారు. ధర్నా అనంతరం, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆస్తిపన్ను రద్దు చేసి, అద్దె ఆధారిత ఇంటిపన్ను పునరుద్ధరించాలని కోరుతూ నగర మేయర్‌కు వినతి పత్రాలను అందజేశారు.
