కాలుష్యాన్ని అరికట్టాలని ధర్నా

Jun 10,2024 22:02 #cpm, #Dharna, #West Godavari District

ప్రజాశక్తి- భీమవరం టౌన్‌ : కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ భీమవరంలోని ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో యనమదుర్రు డ్రెయిన్‌ వంతెనపై సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ జిల్లాలోని అనేక పరిశ్రమలు వాటి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా యథేచ్ఛగా పంట కాలువలు, డ్రెయిన్లలోకి వదిలేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. దీనివల్ల ఏ పంట కాలువ చూసినా కాలుష్యమయమైందని తెలిపారు. ఆ నీటినే తాగునీటి చెరువులకు, పంటలకు వాడుతున్నారన్నారు. దీంతో, ప్రజలు గుండె, లివర్‌, ఊపిరితిత్తులు, కేన్సర్‌, చర్మ తదితర వ్యాధుల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం మధ్య నుంచి ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రెయిన్‌ ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో జీవ నదిలా కళకళలాడుతూ ఉండేదన్నారు. అనేక గ్రామాల ప్రజలకు సాగు, తాగు ఇతర అవసరాలకు ఈ నీటినే వాడేవారని, వేలాది మత్స్యకార కుటుంబాలు చేపల వేట ద్వారా జీవనోపాధి పొందేవారని గుర్తు చేశారు. నేడు పరిశ్రమల కాలుష్యంతో పూర్తిగా మురికి కూపంగా మారిపోయిందన్నారు. వెంకయ్యవయ్యేరు, కాజ డ్రెయిన్‌, బొండాడ డ్రెయిన్ల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలితో జిల్లా కలెక్టర్‌ వెంటనే సమావేశం ఏర్పాటు చేసి కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

➡️