ప్రజాశక్తి-రాజాం (విజయనగరం జిల్లా) : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును బలోపేతం చేసి సమర్థవంతంగా నడపాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాంలో భవన నిర్మాణ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. తొలుత ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి కార్మికశాఖ వరకు ర్యాలీ నిర్వహించారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు సమర్ధవంతంగా నడపాలని, ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన ధర్నాలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వి నర్సింహారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక కొరత, కరోనాతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇసుక కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. నవరత్నాల ముసుగులో వైసిపి ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులన్నీ దారి మళ్లించిందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వకపోగా వందలాది మంది కార్మికులకు క్లెయిమ్‌లు చెల్లించలేదన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇస్తామని ఎన్నికల్లో హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సంక్షేమ బోర్డు ద్వారా పథకాల అమలుపై స్పష్టత లేదని తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, రెన్యువల్స్ ప్రారంభించాలని, అర్హులకు పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ అధికారికి వినతి పత్రం అందజేశారు.