- జయప్రదం చేయండి : కె. సుబ్బరావమ్మ
ప్రజాశక్తి – పార్వతీపురం : గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటం సందర్భంగానూ, ఆ తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. సోమవారం ఐసిడిఎస్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చి, అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంగా జులైలో వేతనాలు పెంచుతామని, మరో 11 డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నా నేటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. 2019 నుంచి ఈనాటి వరకు అంగన్‌వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ అమలు చేస్తామని టిడిపి తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాలలో దాదాపుగా 5600 మినీ సెంటర్లు ఉన్నాయని, వీటిని మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ప్రభుత్వం రూ.ఏడువేలు వేతనం వస్తున్న అంగన్‌వాడీలకు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. సెంటర్ బిల్లులు, టిఎ బిల్లులు, కావెంట్, ఈవెంట్ బిల్లులు రెండేళ్లుగా నిలిచిపోయాయని వెంటనే వీటిని విడుదల చేయాలని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీ సమస్యలపై చర్చించాలని, జీతాలు పెంచాలని, మినీ అంగన్‌వాడీలకు జీవోలు విడుదల చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, సంక్షేమ పథకాలు, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగన్‌వాడీ ప్రాజెక్ట్ సెంటర్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర యూనియన్ పిలిపునిచ్చిందని, ఈ పిలుపులో భాగంగా వర్కర్లు అండ్ హెల్పర్లంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.