‘మన్యం’లో ప్రబలిన డయేరియా

  • గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం మన్యం జిల్లా తాళ్లబురిడిలో డయేరియా ప్రబలింది. గత మూడు రోజులుగా వరుసగా 18 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు ఆధ్వర్యంలో సోమవారం ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని మొత్తం తాళ్లబురిడికి తరలించి గ్రామంలోని వీధులను 12 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇద్దరికి మాత్రమే డయేరియా ఉన్నట్లు గుర్తించామని డిఎం అండ్‌ హెచ్‌ఒ తెలిపారు. మిగతావన్నీ సాధారణ కేసులని, ప్రస్తుతం డయేరియా అదుపులో ఉందని ఆయన చెప్పారు. ఎవరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందడం లేదని తెలిపారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో గ్రామంలో జరిగిన సామూహిక భోజనాల కార్యక్రమంలో ఆహార పదార్థాల్లో జరిగిన కల్తీ వల్ల డయేరియా ప్రబలినట్లు గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ వేతనదారులు డిహైడ్రేషన్‌కు గురికాకుండా ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బంది సరఫరా చేసిన ఒఆర్‌ఎస్‌ ద్రవాన్ని తరచూ తాగుతుండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పిపి యూనిట్‌ వైద్యాధికారి డాక్టర్‌ విజయ మోహన్‌, డోకిశిల వైద్యాధికారులు డాక్టర్‌ ఐశ్వర్య, డాక్టర్‌ కౌశిక్‌తో పాటు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️