ఎస్‌సి వర్గీకరణపై భిన్నాభిప్రాయాలు

Dec 30,2024 23:28 #Classification, #differences, #opinion, #SC
  • ఏకసభ్య కమిషన్‌ అభిప్రాయాల సేకరణ
  • రాజీవ్‌ రంజన్‌ మిశ్రాను కలిసిన మంద కృష్ణ మాదిగ
  • భారీగా తరలివచ్చిన ఎంఆర్‌పిఎస్‌, మాలమహానాడు ప్రతినిధులు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : షెడ్యూల్‌ కులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సోమవారం కలెక్టరేట్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వివిధ కుల సంఘాల నాయకుల నుండి అభిప్రాయాలు, వినతులు స్వీకరించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, జాతీయ, రాష్ట్ర స్థాయి, ఉమ్మడి గుంటూరు జిల్లాల షెడ్యూల్‌ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు అర్జీలు అందజేశారు. తమ అభిప్రాయాలను కమిషన్‌కు తెలియజేశారు. షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశంపై అర్జీలు అందించడానికి వచ్చిన వికలాంగుల వద్దకు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశానికి సంబంధించి మొత్తం 124 అర్జీలు వచ్చాయి. మాల మహానాడు చెందిన వారు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మాలమహనాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్‌సిలంతా ఐక్యంగా ఉండాలంటే వర్గీకరణ చేయకూడదన్నారు. వర్గీకరణ జరిగితే అంతరాలు పెరుగుతాయని కమిషన్‌కు విన్నవించారు. ఎస్‌సిల మధ్య ఎప్పుడూ ఐక్యత లేదని, మాదిగలు గత 50 ఏళ్లుగా రిజర్వేషన్లు పొందలేక నష్టపోయారని మందకృష్ణ మాదిగ వివరించారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. అయితే, గుర్తింపులేని అనేక కులాల స్థితిగతులపై కూడా అధ్యయనం చేయాలని కోరారు.

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌… కమిషన్‌ ముందు తన వాదన విన్పిస్తూ, మాదిగలు చాలా కాలంగా వెనుకబడి ఉన్నారని, విద్య, ఉద్యోగ అవకాశాలను మాలలు వినియోగించు కుంటున్నారని, జనాభా ప్రాతిపదికన ఎవరి అవకాశాలు వారికి దక్కాలని అన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ వర్గీకరణకు సానుకూలంగా ఉండగా వైసిపి అధినేత జగన్‌ మాత్రం గోడమీద పిల్లివాటంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

చట్టబద్ధత కల్పించాలి : మందకృష్ణ మాదిగ

సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ నివేదికను పూర్తి అధ్యయనం చేసి మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి ఎస్‌సి వర్గీకరణకు ఆమోదం తెలపాలని మంద కృష్ణ మాదిగ కోరారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతి కులానికీ రిజర్వేషన్‌ ఫలాలు అందాలన్నారు. లాల్‌ బహుదూర్‌ శాస్త్రి నియమించిన లోకూర్‌ కమిటీ కూడా మాదిగలు వెనుకబడ్డారని తేల్చిందని గుర్తు చేశారు. రెల్లి కులంలోని 12 ఉప కులాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఒక్క శాతం కూడా దక్కడం లేదన్నారు. మాలల్లోని మాల దాసరి కూడా ఎస్‌సి వర్గీకరణ కోరుకుంటున్నారని తెలిపారు.

➡️