రేపల్లె : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలా మనం అబద్ధాలు ఆడలేకపోయామని వైఎస్సార్‌సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కార్యకర్తల సమావేశంలో అన్నారు. ఈరోజు రేపల్లె నియోజక వర్గంలో జరిగిన వైఎస్సార్‌సిపి పార్టీ కార్యకర్తలతో, ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రేపల్లె నియోజకవర్గంలో మనకు కొన్ని అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. ఇది సష్టి సహజం. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష.. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుంది. మనం ఐదేళ్ల పాలనా కాలంలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం. నేను వైయస్సార్ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలం.. అన్ని పనులు ప్రజలకు చేశాం.. మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగద్ది కాదని, అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి మన పార్టీ మాత్రమే చెప్పింది.. ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చామని’ జగన్ అన్నారు.
చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం. ఆయన చెప్పే అబద్ధాలతో మనం పోటీ పడలేకపోయాం. ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పినా.. ఈరోజు ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. వాళ్లు చెప్పిన అబద్దాల వల్లే తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పిల్లలు రూ.15వేలు గురించి అడుగుతారు.. మహిళలు రూ.18వేలు గురించి అడుగుతారు.. పెద్దవాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు అని జగన్ చెప్పుకొచ్చారు. ఈ నాలుగు నెలల కాలంలో విద్యా, వైద్యరంగాలను నాశనం చేశారు.. వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి. డోర్‌డెలివరీ పద్ధతిని తీసేశారు.. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్.. రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది.. ప్రజలను భయపెడుతున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో హద్దుల్లేని అవినీతి జరుగుతోంది.. పేకాట క్లబ్బులు ప్రతినియోజకవర్గంలో నడుస్తున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇసుకను ఎక్కువరేట్లకు అమ్ముతున్నారు.. చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.. ప్రజలను అబద్ధాలతో మోసం చేశారు.. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. అన్నీ చేసిన మనకే ఇలా అయితే, ప్రజలను ఇంతలా మోసంచేసిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు సింగిల్ డిజిట్‌కూడా ఇవ్వరు.. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్ చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చం.. ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగింది అని జగన్ వెల్లడించారు.
