- జీవించే హక్కులో ఇదీ అంతర్భాగమే : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : డిజిటల్ యాక్సెస్ అనేది ప్రాధమిక హక్కని, జీవించే హక్కులో ఇది కూడా అంతర్భాగమేనని సుప్రీం కోర్టు బుధవారం పేర్కొంది. డిజిటల్ యాక్సెస్ అన్నది ప్రాధమిక హక్కు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు, సమాజంలో అట్టడుగు వర్గాల వారితో సహా ప్రతి ఒక్కరికీ డిజిటల్ యాక్సెస్‌బిలిటీని ప్రభుత్వం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. (డిజిటల్ యాక్సెస్ అంటే డిజిటల్ సాంకేతికతలు, ఇంటర్‌నెట్, కంప్యూటర్లు, వంటి వనరులు అందరికీ అందుబాటులో వుండేలా, వాటిని వారు వినియోగించుకునేలా చూడడం).
సమాజంలో వెనుకబాటుకు గురైన, అట్టడుగు వర్గాలకు చెందినవారు, వికలాంగులు, అందరికీ డిజిటల్ ఎకో వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన బెంచ్ రూలింగ్ ఇచ్చింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) ప్రక్రియను మెరుగుపరిచేందుకు, అందరికీ మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ సందర్భంగా ప్రభుత్వానికి 20మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్, ఆన్‌లైన్ సర్వీస్, డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, నెట్ బ్యాంకింగ్ ఇలా భారతదేశంలో డిజిటల్ పురోగతి విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో అసలు ఈ సాంకేతికతలు నిజంగా అందరికీ చేరువవుతున్నాయా లేదా అనే కీలకమైన అంశం పరిశీలనకు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతోందని కోర్టు అభిప్రాయపడింది.
జీవించే ప్రాధమిక హక్కు, మరియు స్వేచ్ఛా హక్కులోనే డిజిటల్ యాక్సెస్ హక్కు అనేది అంతర్భాÛగంగా వుంటుందని తీర్పు రాసిన జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. కేవలం సమాజంలోని కొన్ని వర్గాల వారికి మాత్రమే సేవలందించేలా కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో వుండేలా, ఉపయోగించుకునే రీతిలో డిజిటల్ ఎకో వ్యవస్థలను రూపొందించాల్సినస అవసరం చాలా వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రయాగ ప్రసూన, మరికొందరి నేతృత్వంలోని యాసిడ్ దాడి బాధితుల బృందం, బధిరుడైన అమర్ జైన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన కోర్టు తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. యాసిడ్ దాడి బాధితులతో పాటు వికలాంగులు డిజిటల్ కెవైసి ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేయడమనేది దాదాపు అసాధ్యమని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
స్క్రీన్‌పై ఇచ్చిన నిర్దిష్ట ఫ్రేమ్‌ల్లో తమ ముఖాలను పెట్టడం, అలాగే తలను అటూఇటూ కదల్చడం, కళ్లు ఆర్పడం వంటి అంశాలు యాసిడ్ దాడికి గురైన వారికి లేదా ముఖంలో అంగవైకల్యంతో బాధపడేవారికి సాధ్యం కాదని జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. ఫలితంగా వారు తమ గుర్తింపును డిజిటల్‌గా నిర్ధారించలేని పరిస్థితులు నెలకొంటాయన్నారు. దీనివల్ల వారు బ్యాంక్ ఖాతాను తెరవడానికి కూడా చాలా జాప్యం జరుగుతుంటుందన్నారు. అలాగే కీలకమైన సేవలందుకోవడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోవడానికి కూడా వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇలా వికలాంగులకు సహకరించని డిజిటల్ వాతావరణం వుండడంతో ఈ వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని సమాజంలోని ప్రధాన స్రవంతితోకి కలుపుకోవడానికి బదులుగా వారి జీవనాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నారని న్యాయస్థానం పేర్కొంది.
ఈ సమకాలీన శకంలో ముఖ్యమైన సర్వీసులు, పాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక అవకాశాలు ఇవన్నీ కూడా డిజిటల్ వేదికల ద్వారానే ప్రజలకు చేరువవుతున్నాయని జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. ఈ సాంకేతిక వాస్తవికతల నేపథ్యంలో రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద జీవించే హక్కుకు తిరిగి భాష్యం చెప్పాల్సి వుందన్నారు.
డిజిటల్ అంతరాన్ని తగ్గించడమనేది విధానపరమైన విచక్షణ కింద ఇక చూడలేమని, హుందాగా, స్వయంప్రతిపత్తితో, సమాన ప్రాతినిధ్యంతో ప్రజా జీవనంలో గడిపేందుకు రాజ్యాంగబద్ధంగా తప్పనిసరైన అంశంగా మారిందని సుప్రీం కోర్టు పేర్కొంది.
అలాగే గ్రామీణ భారతంలోని ప్రజలు కూడా ఇంటర్‌నెట్ సౌకర్యం సరిగా పొందలేకపోతున్నారని, ప్రాంతీయ భాషల్లో అరకొర సమాచారమే వుంటోందని, దీనివల్ల ఇ-గవర్నెన్స్, సంక్షేమ పథకాలు అటువంటి వారికి అర్ధవంతమైన రీతిలో చేరువ కావడం లేదని కోర్టు పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ పోర్టల్స్, ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికలు, ఆర్థికపరమైన సాంకేతికతలతో సహా డిజిటల్ మౌలిక వసతుల వ్యవస్థ సార్వజనీనంగా అందరికీ అందుబాటులోకి రావాలని, రాజ్యాంగంలోని 21, 14, 38 అధికరణల కింద ఇవి ప్రభుత్వ బాధ్యతలని కోర్టు స్పష్టం చేసింది.