ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : త్వరలో పౌరులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని, తద్వారా పౌరులు రేషన్ పొందే సదుపాయం సులభతరం అవుతుందని ఐటి, ఆర్‌టిజిఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్పాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కావాలన్నారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ఆయన వాట్సాప్ గవర్నెన్స్‌పై మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు సీమ్‌లెస్ సర్వీసులు అందజేయాలన్నదే తమ ఆశయమన్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖలన్నీ తమ డేటాను ఆర్‌టిజిఎస్‌లోని డేటాలేక్‌కు అనుసంధానం చేసి సహకారం అందివ్వాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలంటే ఆయా శాఖల సహకారం చాలా అవసరమన్నారు. ఒక పౌరుడు ఒక ఆలయానికి వెళ్లాలనుకుంటే వాట్సాప్‌లోనే ఆలయ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి పొందడం వంటి అన్నీ వాట్సాప్‌లో అనుసంధానం అవ్వాలని అధికారులకు లోకేష్ సూచించారు. ఇవన్నీ చేయాలంటే ఆయా శాఖలు తమ ఐటి విభాగాలను సాంకేతికంగా మెరుగుపరుచుకోవడంతో పాటు తమకు సహకారం అందివ్వాలన్నారు. అందరి భాగస్వామ్యం, సహకారంతోనే ఈ ప్రక్రియను విజయవంతం చేయగలుగుతామని తెలిపారు.
