ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అక్టోబర్ 1,2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షలను నిర్వహించాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. శనివారం విజయవాడలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆద్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి ఓబులేసు, ఐఎఫ్‌టియు నాయకులు కె పొలారి, ఐఎఫ్‌టియు నాయకులు రామకృష్ణ, టిఎన్‌టియుసి నాయకులు రఘురామరాజు, టియుసిసి నాయకులు పివి సుందరరాజు, ఎఐసిసిటియు నాయకులు ఎం ఈశ్వర్, ఎఐఎఫ్‌టియు నాయకులు జె కిశోర్‌బాబు, ఐఎన్‌టియు నాయకులు పాల్గొని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణకు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో, అక్టోబర్2వ తేదీన గాంధీ జయంతి రోజున రాష్ట్రంలోని కార్మిక సంఘాల ఆద్వర్యంలో అక్టోబర్ 3న రైతు సంఘాలు, వ్యవసాయకార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రం, ముఖ్యపట్టణాలు, మండల కేంద్రాల్లో జరిగే ఈ మూడు రోజుల దీక్షలను జయప్రదం చేసేందుకు కార్మిక సంఘాలు కృషి చేయాలని వారు పేర్కొన్నారు. ఈ దీక్షలకు పెద్ద సంఖ్యలో కార్మికులు, రైతులు, వ్యవసాయకార్మికులు, విద్యార్ధులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.