గంగవరం పోర్టు కార్మికులపై అక్రమ కేసు కొట్టివేత

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టు కార్మికులపై పెట్టిన అక్రమ కేసును విశాఖ జిల్లా 8వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మంగళవారం కొట్టివేసింది. గంగవరం పోర్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, సంస్థలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన యూనియన్‌ నాయకులను విధుల్లోకి తీసుకోవాలని, కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన 2016 డిసెంబర్‌ 9న పోర్టు వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల పోరాటానికి సిపిఎం, సిఐటియు నాయకులు అండగా నిలిచారు. ఆందోళనకారులపై అప్పటి టిడిపి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయించింది. సిపిఎం జిల్లా నాయకులు ఎం.జగ్గునాయుడు, డాక్టర్‌ బి.గంగారావు, బి.జగన్‌, సిఐటియు జిల్లా నాయకులు కెఎం.శ్రీనివాసరావు, ఎన్‌.రామారావు, ఎస్‌.జ్యోతీశ్వరరావు, బి.ఢిల్లీరావు, గంగవరం పోర్టు యూనియన్‌ నాయకులు కారి అప్పారావు, కె.భూలోక, కె.మహేష్‌ సహా 18 మందిపై 2017లో తప్పుడు కేసులు బనాయించింది. కేసు పూర్వాపరాల పరిశీలన, వాదప్రతివాదనల అనంతరం 8వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి ఈ కేసును కొట్టివేశారు. కార్మికుల తరపున ఈ కేసును ప్రముఖ న్యాయవాది జి.సీతామహాలక్ష్మి వాదించారు. ఇప్పటికైనా అదానీ గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ఇతర నేతలు డిమాండ్‌ చేశారు. మిగిలిన అక్రమ కేసులనూ ఎత్తివేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

➡️