ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : విశాఖపట్నం మేఘాలయ హోటల్‌లో 2017లో నిర్వహించిన అందాల పోటీలను వ్యతిరేకిస్తూ ఐద్వా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, పిఒడబ్ల్యు, సిఎంఎస్ సంఘాలు ఆందోళన చేయడంతో అప్పట్లో ఆయా సంఘాలకు చెందిన 27 మంది మహిళా నేతలపై పోలీసులు నమోదు చేసిన కేసును మంగళవారం మూడవ అదనపు సివిల్ న్యాయమూర్తి జి.కార్తీక్ కొట్టివేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. మహిళలను అసభ్యకరంగా చూపించడాన్ని ఖండించినందుకు తమపై ప్రభుత్వం కేసు పెట్టిందని, కానీ అందాల పోటీలను ఆపలేక పోయిందని, ఇది మహిళా లోకాన్ని అవమానపర్చడమేనన్నారు. మహిళా అభ్యుదయానికి ప్రభుత్వాలు పాటుపడాలని కోరారు. తమ తరఫున న్యాయం కోసం కృషి చేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రభావతి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల, ఎమ్‌డి బేగం,బి. పరమేశ్వరి, సిహెచ్ నూకాలమ్మ, ప్రగతిశీల మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, సిఎంఎస్ జిల్లా అధ్యక్షులు డి.లలిత తదితరులతో మొత్తం 27 మంది మహిళలపై అప్పట్లో కేసు నమోదు చేశారు.