అవసరానికి మించి తీసుకుంటే అభివృద్ధి ఎప్పటికి సాధ్యం?
రాజధానిలో నిలిచిన లావాదేవీలు
భూముల ధరలు తగ్గుతాయని సమీకరణ రైతుల ఆందోళన
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అవసరాల కోసం మరో 44 వేల ఎకరాల భూమిని తీసుకోవాలన్న ప్రతిపాదనలపై దుమారం చెలరేగుతోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ మాత్రం రాజధాని అవసరాల కోసం ఇంకా పది వేల ఎకరాలు మాత్రమే అవసరం ఉందని మంగళవారం ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే లైను, పారిశ్రామికవేత్తలకు కలిపి పది వేల ఎకరాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 2015లో రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో భూ సమీకరణ చేయలేదు. పెదపరిమి, హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో దాదాపు పది వేల ఎకరాల భూమి ఉంది. తాజా భూ సమీకరణను ఈ మూడు గ్రామాలతోపాటు దాదాపు నాలుగు మండలాల్లో 44 వేల ఎకరాల భూ సమీకరణ ప్రతిపాదన తెరపైకి తేవడం వివాదం అవుతోంది. వడ్డమాను గ్రామంలో భూ సమీకరణకు బుధవారం నిర్వహించిన గ్రామసభలో రైతులు అధికారులను నిలదీశారు. రాజధానికి ఇప్పుడు మేం భూములు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గ కేంద్రం అయిన తాడికొండలో కూడా పది వేల ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామం మొత్తం భూ సమీకరణ చేస్తారన్న ప్రచారంతో గ్రామస్తుల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటి అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, కర్లపూడి, యండ్రాయి గ్రామాల్లో దాదాపు పది వేల ఎకరాలు అందుబాటులో ఉండడంతో ఈ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మెజార్టీ రైతులు అంగీకారం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ సభలు జరిగాయి. 2015 జనవరిలో ప్రారంభమైన భూ సమీకరణలో 37,941 ఎకరాలకుగాను 34,689 ఎకరాలను సిఆర్‌డిఎకు రైతులు అప్పగించారు. మిగిలిన 3,,252 ఎకరాలను ఇవ్వడానికి దాదాపు వెయ్యి మంది రైతులు సుముఖత వ్యక్తం చేయలేదు. భూ సమీకరణలో తీసుకున్న 34,689 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూములు మరో 17 వేల ఎకరాలు కూడా రాజధానికి వినియోగించుకునేందుకు సిఆర్‌డిఎ తన అధీనంలోకి తీసుకుంది. మొత్తంగా 51 వేల ఎకరాలు రాజధానికి సిద్ధం చేశారు. రైతులు ఇచ్చిన 34,689 ఎకరాల్లో దాదాపు పది వేల ఎకరాలను అభివృద్ధి చేసి రైతులకు గృహ అవసరాలు, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి మూడేళ్లలో ఇస్తామని చెప్పి పదేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి భూ సమీకరణకు వెళ్లాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై రాజధాని రెతుల్లోనూ అసంతృప్తి ఏర్పడింది. రాజధానికి పరిసరాల్లో ఇంత పెద్ద ఎత్తున భూమి తీసుకుంటే తమ ప్లాట్లకు విలువ ఎలా పెరుగుతుందనేది వారి ప్రధాన ప్రశ్నగా ఉంది. రాజధాని విస్తరణ ప్రతిపాదనలపై ఇంతవరకూ అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి అప్పగిస్తారన్నదీ ఇప్పటికీ అయోమయంగానే ఉంది. ఇప్పటికే చాలామంది రైతులు తమ భూములను సమీకరణ ద్వారానే ఇతరులకు విక్రయించుకున్నారు. దాదాపు ఆరు వేల ఎకరాలు చేతులు మారింది. రాజధాని నిర్మాణాలు పూర్తయి తమ ప్లాట్లకు మంచి ధరలు వచ్చి లబ్డి పొందుదామని అనుకుంటున్న రైతులకు అదనపు భూ సమీకరణ అంశం పిడుగుపాటు వార్తలా మిగిలింది. గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.