- ఏచూరికి 27వ మహాసభ ఘన నివాళులు
- అమరులకు విప్లవ జోహార్లు
- సంతాప తీర్మానం ఆమోదించిన సిపిఎం రాష్ట్ర మహాసభ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా విప్లవోద్యమంలో అమరులైనవారికి, ముఖ్యంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి మహాసభ ఘన నివాళులర్పించింది. ఇటీవల మరణించిన ప్రముఖులకు సంతాప సూచకంగా ప్రతినిధులు, ఆహ్వానితులు, నగర ప్రముఖులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాసభ ప్రారంభానికి ముందు సంతాప తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శివర్గ వి.వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ నాయకులు వియత్నాం కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్‌గుయోన్ పూట్రాంగ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మాజీ అధ్యక్షులు జియాంగ్ జెమిన్, చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్, కొలంబియా కమ్యూనిస్టు నాయకులు ఎలిజిబెత్‌లకు మహాసభ నివాళులర్పించింది.
విప్లవ రాజకీయాల అధ్యయనం ఏచూరి సొంతం
పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ గత ఏడాది సెప్టెంబరు 12న కన్నుమూసిన సీతారాం ఏచూరి వామపక్ష ఉద్యమానికి వేగుచుక్కలా నిలిచారన్నారు. 1974లో సిపిఎం సభ్యత్వం స్వీకరించిన ఏచూరి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘానికి మూడుసార్లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం పార్టీ కేంద్ర కమిటీ, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా, ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న ఏచూరి రాజకీయాల అధ్యయనంలోనూ, ఆచరణలో నిబద్ధత, ఆశయంపై అంకితభావం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. మార్క్సిస్టు సిద్దాంతాన్ని దేశ పరిస్థితులకు అన్వయించడంలో అనేక సంక్లిష్టతలను అధిగమించడంలో ఆయన కనబరిచిన పరిణితి ఎంతో విలువైందని పేర్కొన్నారు. యునైటెడ్‌ఫ్రంట్, యుపిఏ ప్రభుత్వాల ఏర్పాటులో పార్టీ తరుపున ఆయన కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఇండియా బ్లాక్ ఏర్పాటులోనూ ఆయన కృషి కీలకమని, లౌకిక ప్రజాస్వామిక పార్టీలను ఏకం చేయడంలో అహర్నిశలూ కృషి చేశారని వివరించారు. రాజ్యసభ సభ్యుడిగా అనేక విషయాలపై లోతైన చర్చలు చేయడంతోపాటు మతతత్వ విభజన రాజకీయాలను ఎండగట్టడంలో అద్వితీయమైన పాత్ర పోషించారని అన్నారు. ఎన్నో ముఖ్యమైన అంశాలపై రచనలు చేశారని, సిపిఎం జాతీయ నాయకుడిగా దేశ విదేశాల కమ్యూనిస్టు పార్టీలతో ఆయన చేసిన చర్చలు, స్నేహ సంబంధాలు నెలకొల్పడంలో కృషి మరువలేదని తెలిపారు. ఈ సమయంలో ఏచూరి మరణం సిపిఎంతోపాటు వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన నడిచిన మార్గంలో నిబద్ధతతో ఆశయానికి అంకితమవడమే మనం ఆయనకు అర్పించే నివాళని 27 మహాసభ విప్లవ జోహార్లు అర్పించింది.
ఆమరుల ఆశయ స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో అమరులైన అనేక మంది ఉద్యమ నేతలకు మహాసభ నివాళులర్పించింది. తెలంగాణా సాయుధ పోరాట యోధులు, కేంద్రకమిటీ సభ్యులు, మహిళా ఉద్యమ నిర్మాత మల్లు స్వరాజ్యానికి నివాళులర్పించారు. రుద్రరాజు సత్యనారాయణ, బెంగాల్ మాజీ సిఎం బుద్దదేవ్ బట్టాచార్య, కేరళ నాయకులు కొడియేరి బాలకృష్ణన్, తమిళనాడు మాజీ కార్యదర్శి ఎన్.శంకరయ్య, సిపిఎం పార్లమెంటరీ పార్టీ నాయకులు బాసుదేవ్ ఆచార్య, ఎమ్.తివారి, ఎంసి జోసెఫిన్, మృదుల్‌డే, సిరాల్కర్, సారంగధర్ పాస్వాన్, ఎంఎం లారెన్స్, మదన్‌ఘోష్‌కు నివాళులర్పించారు. కనరుబెనర్జీ, శివాజీ పట్నాయక్, సునీత్ చోప్రా, కెఎన్ రాజన్, జతిన్ సోరెన్, నారాయణ్ రోపిణి, బయ్యారెడ్డి, ఐజాజ్ అహ్మద్, అభిజిత్‌సేన్, పీకె నారాయణ్, కుంచిరామన్, సుదేందు బెనర్జీ, కె.మజుందార్, జికె శుక్లా, ప్రదీప్‌సింగ్, వి.కె.రామకృష్ణ, వాసుదేవనాయర్‌కు నివాళులర్పించారు. కేరళలో నిరుద్యోగ సమస్యలపై పోరాడి కాంగ్రెస్ గూండాలు, పోలీసుల దాడులకు గురై 30 సంవత్సరాలపాటు బెడ్‌మీదేఉండి చివరిదాకా కమ్యూనిస్టుగా నిలిచిన కూతుపరంబ యోధుడు పుష్పన్‌కు ఘన నివాళులర్పించారు. మతోన్మాదులు, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు, సంఘ విద్రోహ శక్తుల అమానుష హత్యాకాండలో అసువులు బాసిన అరుణతారలకు నివాళులర్పించారు. వారిలో త్రిపురకు చెందిన బెనూ బిశ్వాస్, ఘోస్వామి బాదల్‌షీల్, దిలీప్ శక్తిదాస్, షాహిద్‌మియా, కృష్ణపాద్ తుడూ, కేరళ విద్యార్థి నేత ధీరజ్, యువ నాయకులు కొరాంబిల్ హరిదాస్, షాజహాన్, రాజస్థాన్ విద్యార్థి నేత రాకేష్ ఝుఝారియా, బీహార్‌కు చెందిన రాజేష్ హంస్థాకు, అగ్నిపథ్ పోరాటంలో చనిపోయిన రాకేష్‌కు జోహార్లు అర్పించారు.
రాష్ట్ర ఉద్యమ వీరులకు జోహార్లు
26వ మహాసభ నుండి 27వ మహాసభ వరకూ రాష్ట్రంలో అమరులైన పలువురికి మహాసభ జోహార్లు అర్పించింది. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ షేక్ సాబ్జి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి, గోదావరి జిల్లాలకు చెందిన వలవల శ్రీరామమూర్తి, బి. రాజారావు, బి.రాజులోవ, వాసంశెట్టి వెంకట్రావు, కుడిపూడి రాఘవమ్మ, వసంతకుమార్, పల్నాటి సూర్యప్రకాష్, నెల్లూరు జిల్లాకు చెందిన జెడ్డా మస్తానయ్య, ఉండ్రాల మాలకొండయ్య, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఎం.ప్రభాకర్, మురాల రాజేష్, ఆర్.కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని సాంబశివరావుకు మహాసభ ఘన నివాళులర్పించింది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆర్‌పిరాజు, అనకాపల్లి జిల్లాకు చెందిన ఎ.బాలకృష్ణ, మళ్ల సత్యనారాయణ, సత్తిబాబు, కర్నూలు జిల్లాకు చెందిన ఎస్.సోమన్న, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి శ్రీరాములు, కొల్లి సత్యం మాస్టారు, విజికెమూర్తి, ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లాకు చెందిన పూనెం సత్యనారాయణ, అనంతపురం జిల్లాకు చెందిన ముష్కిన్, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన పోలా రామాంజనేయులుతోపాటు పర్సా భారతి, నండూరి సుమిత్రకు నివాళులర్పించారు. తెలంగాణాకు చెందిన లక్ష్మీదేవమ్మ, తెలంగాణా పోరాట నాయకులు భూక్యానాయక్, సిపిఐ అఖిల భారత నాయకులు అతుల్‌కుమార్‌ఆంజన్, ప్రజాగాయకులు గద్దర్, మాజీ ఎంపి సెల్వరాజ్, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, పౌరహక్కుల నేత సాయిబాబుకు నివాళులర్పించారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, స్వామినాథన్, రామోజీరావు, ఆరుద్ర సతీమణి రామలక్ష్మి, రచయిత్రి వేములపల్లి సత్యవతి, శ్యామలాంబ, ఇలాభట్, కేతు విశ్వనాథరెడ్డి, లతా మంగేష్కర్, జాకీర్ హుస్సేన్, శ్యాంబెనగళ్, సినీ తారలు కృష్ణ, జమున, కైకాల సత్యనారాయణ మహాసభ నివాళులర్పించింది.
వీరితోపాటు ఇటీవల కాలంలో చనిపోయిన పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ఢిల్లీ రైతాంగ పోరాటంలోనూ, కార్మిక, అంగన్‌వాడీ ఉద్యమంలో అశువులు బాసిన, సామ్రాజ్యవాదుల నాయకత్వంలో ఇజ్రాయిల్ యుద్ధంలో మరణించిన పాలస్తీనా ప్రజలకు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో మరణించిన వారందరికీ 27వ మహాసభ సంతాపాన్ని ప్రకటించింది.