- ఆయన స్ఫూర్తితో ఉద్యమాలు
- రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం
- రుద్రరాజు సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- భీమవరం : రాజకీయాల్లో డబ్బు, పదవులు రాజ్యమేలుతున్నా, అవేమీ మాకొద్దని విలక్షణమైన రాజకీయ నేతగా రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్) ముందుకు సాగారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎంఎల్‌ఎ ఆర్‌ఎస్ సంస్మరణ సభ ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షతన భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో బుధవారం జరిగింది. తొలుత ఆర్‌ఎస్ చిత్రపటానికి ఆచంట ఎంఎల్‌ఎ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, వి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యవక్త శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్‌ఎస్ అంటే కార్మికులకు, ప్రజలకు ఒక ధైర్యమని అన్నారు. ఏదైనా సమస్యను పట్టుకుంటే సాధించే వరకూ ఉక్కు సంకల్పంతో పోరాడేవారని తెలిపారు. 17 ఏళ్ల వయస్సులోనే ఎర్రజెండా పట్టుకుని కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. అసెంబ్లీలో పోరాడే నేతగా ప్రజల పక్షాన నిలిచారన్నారు. విశాఖ ఉక్కు పోరాటంలో ఆర్‌ఎస్ పాత్ర ఎనలేనిదని తెలిపారు. సిపిఎం జిల్లా ఉద్యమ నిర్మాణంలో అల్లూరితోపాటు ఆర్‌ఎస్ ఎంతో కృషి చేశారన్నారు. కేడర్ పట్ల అపారమైన అభిమానం ఆర్‌ఎస్ చూపించేవారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్ మృతి చెందిన కొద్ది రోజుల్లోనే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారని, అంతా కమ్యూనిస్టులు పని అయిపోయిందని చెప్పుకునే తరుణంలో ఆకలి కేకలు వేసిన శ్రీలంకలో కమ్యూనిస్టు జెండా ఎగిరిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో చుట్టుపక్కల దేశాలు శత్రువులయ్యాయని తెలిపారు. తిరుమల లడ్డూకు రాజకీయ రంగు పులిమి మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూడడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి టిటిడిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీకి చెందిన వారంతా టిటిడిలో సభ్యులుగా ఉండాలని ఉవ్విళ్లూరడం వెనుక ఆంతర్యం అదేనని తెలిపారు. ప్రజల సొమ్ము, దేవుని సొమ్ము దోచుకుంటున్న వారు ఎవరో అందరికీ తెలుసన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై ప్రభుత్వం సిట్ వేసిందని, విచారణ జరిగేంత వరకూ ఆగకుండా ప్రాయశ్చిత దీక్ష అంటూ, సనాతన ధర్మపరిరక్షణ అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడడం దారుణమన్నారు. క్రైస్తవులను, ముస్లింలను తిట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మతవిద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు రాజకీయ శక్తులు తెగబడుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రాంతీయ పార్టీ టిడిపి మతం రంగు పులుముకుందని విమర్శించారు. మతోన్మాదం పెరిగితే రాష్ట్రంలో మతవిద్వేషాలు పెరుగుతాయని, దీనికి టిడిపి, జనసేన బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మతోన్మాద శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బిజెపి రేపిస్టు పార్టీగా తయారైందని విమర్శించారు. మత సామరస్యం కోసం ఆర్‌ఎస్ జీవితాన్ని ధారపోశారన్నారు. సమసమాజ స్థాపన కోసం, ప్రజాసామ్యాన్ని కాపాడేందుకు చివరి వరకూ పోరాడారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో మాదిరిగా నేటి పోరాటాల్లో యువత భాగస్వామ్యం కావాలని, అదే ఆర్‌ఎస్‌కు నిజమైన నివాళని అన్నారు. ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఏ పార్టీలో ఉన్నా కమ్యూనిస్టు పార్టీ అభిమానినని, ఆర్‌ఎస్ జీవన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబంతో ఆర్‌ఎస్‌కు ఎనలేని అనుబంధం ఉందని తెలిపారు. బలం, పోరాటం, స్ఫూర్తి కమ్యూనిస్టుల వద్ద ఉంటుందన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఎన్‌విఎన్ గుప్తా, ప్రముఖ రచయిత కుమార్ తదితరులు మాట్లాడారు. తొలుత ఆర్‌ఎస్ జీవన ప్రస్థానంపై ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికను వి.శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం బుధవారం రాత్రి ఆర్‌ఎస్ స్వగ్రామం యలమంచిలి మండలం చించినాడలో సిపిఎం మండల కార్యదర్శి కె.బాలరాజు అధ్యక్షతన జరిగిన సభలో వి.శ్రీనివాసరావు, మంతెన సీతారాం, సిపిఎం సీనియర్ నేత కేతా సూర్యారావు, ఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు ప్రసంగించారు.