- రెండు బృందాలు ఏర్పాటు : బోర్డు చైర్మన్
ప్రజాశక్తి -తిరుమల : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయించిన మేరకు జనవరి 12 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టిటిడి చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ..ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులను స్వయంగా సందర్శించి ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వైజాగ్, నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారని, తమిళనాడు, కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంత రాం, సుచిత్ర ఎల్లా ఉన్నారని తెలిపారు. వీరు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారని తెలిపారు. ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టిటిడి సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్య వివరాలను కూడా ధ్రువీకరించి సేకరిస్తాయని చెప్పారు. తీవ్రంగా గాయపడిన యాత్రికులకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను, పాక్షికంగా గాయపడిన వారికి రూ.రెండు లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారని తెలిపారు.