తిరుపతి క్షతగాత్రులకు పరిహారం పంపిణీ

  • ఆస్పత్రిలో టిటిడి చైర్మన్‌ పరామర్శ

ప్రజాశక్తి – తిరుమల సిటీ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్ల కోసం చోటు చేసుకున్న తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురికి పరిహారం అందజేశారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు శనివారం పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఎస్‌.తిమ్మక్క, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన పి.ఈశ్వరమ్మకు చెరో రూ.ఐదు లక్షలు చొప్పున పరిహారాన్ని అందించారు. గాయాలపాలైన అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన సర్వశ్రీ కె. నరసమ్మ, పి.రఘు, కె.గణేష్‌, పి.వెంకటేష్‌, చిన్న అప్పయ్యలకు… ఒక్కొక్కరికి రూ. రెండు లక్షలు చొప్పన పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. మతి చెందిన ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టిటిడి పాలకమండలిలోని కొంత మంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ రెండు కమిటీలకు సంబంధించిన రవాణ, తదితర ఖర్చులను తన సొంత నిధులు నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామని చెప్పారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌, టిటిడి జెఇఒ వి. వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్‌ డా.ఎస్‌.వెంకటేశ్వర్‌, స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీ కుమార్‌ల సమక్షంలో పరిహారం చెక్‌లను పంపిణీ చేశారు.

➡️