ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల జిల్లా) : వరద బాధితులకు జరిగిన అపార నష్టాన్ని పూడ్చటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు రావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కె.ధనలక్ష్మి, కె.ఉమామహేశ్వరరావు, ఆర్‌వి.నరసింహారావు కోరారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో వరద బాధితులకు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 200 మంది కార్మిక కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. పెసర్లంక గ్రామంలో వరద బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కృష్ణానది తీర ప్రాంతమైన లంక గ్రామాల్లో వరద ముంపునకు సర్వం కోల్పోయిన వరద బాధితులకు సిఐటియు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి విపత్తును చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.