ఏపీ విద్యార్ధులకు ‘స్టూడెంట్‌ కిట్‌’లు పంపిణీ

అమరావతి: ఏపీ విద్యార్ధులకు కొత్త ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ అందించింది. ఈ నెల 13 నుంచే యధాతధంగా విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. గడిచిన ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు,యూనిఫామ్‌తో కూడిన కిట్స్‌ సంగతేంటనే ప్రశ్న గత కొన్నిరోజులుగా ప్రజల్లో తలెత్తింది. అయితే కొన్ని మార్పులు చేసి.. వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
విద్యా కానుక కిట్లకు బదులుగా ‘స్టూడెంట్‌ కిట్‌’లుగా పేరు మార్చి స్కూలు బ్యాగులపై గతంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఫోటోను కూడా తీసివేశారు. ఈ కిట్లలో ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు ఉంచి స్కూళ్ల వారీగా కేటాయించారు. బెల్టులు, షూలు, పుస్తకాలు.. ఇలా అన్ని కూడా స్టూడెంట్‌ కిట్లలో ఉన్నాయో.. లేదో.. సరిగ్గా చూసి.. ప్రతీ జిల్లాలోని స్కూల్స్‌కు ఆయా కిట్లను చేరవేసేలా చర్యలు తీసుకుంది విద్యాశాఖ. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్‌ 13 నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.

➡️