మూడు కేటగిరిలుగా సచివాలయాల విభజన

  • కీలకమార్పులు చేస్తూ జిఒ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరిలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గురువారం జీఓఎంఎస్‌ నెంబరు3ను విడుదల చేసింది. ఇక నుంచి సచివాలయాలను ఎ, బ, సి కేటగిరీలుగా విభజిస్తున్నట్లు అందులో పేర్కొంది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయాలకు ఇద్దరు, 2501 నుంచి 3500 వరకు జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు సిబ్బందిని కేటాయించింది. అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే నలుగురు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుభాటు చేయాలని నిర్ణయించింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల్లోని మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్‌ను జనరల్‌ పర్పస్‌గానూ, టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ను స్పెషిఫిక్‌ ఫంక్షనరీస్‌గానూ మార్పు చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు సచివాలయ సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

➡️