అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయండి

  • ముఖ్యమంత్రికి కె రామకృష్ణ లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 6 నెలలు నిర్ధిష్ట కాలపరిమితి విధించి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ సిఎం చంద్రబాబుకు ఆదివారం లేఖ రాశారు. దాదాపు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి అగ్రిగోల్డ్‌ సంస్థ రూ.6,380 కోట్లు డిపాజిట్లుగా సేకరించి, బోర్డు తిప్పేసి మోసం చేసిందన్నారు. మన రాష్ట్రంలో 19.52 లక్షల మంది డిపాజిట్‌దారులు అగ్రిగోల్డ్‌ కంపెనీ మోసానికి గురయ్యారన్నారు. 600 మందికి పైగా కస్టమర్లు, ఏజెంట్లు ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు గురయ్యారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థకు 1,73,662.37, చదరపు గజాల స్థలాలు, 368.18 ఎకరాల భూమిని, దీని అనుబంధ సంస్థలకు చెందిన రూ.227 కోట్ల విలువైన ప్లాంట్లు, యంత్రాలను జప్తు చేశారన్నారు. ఈ వ్యవహరం పూర్తయి 11 ఏళ్లు గడుస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. రూ.906 కోట్లుగా ఉన్న, రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు రెండు విడతలుగా కొంత మేర చెల్లింపులు జరిగాయని, ఇప్పటికీ 10.50 లక్షల మంది బాధితులకు రూ.3,080 కోట్లు అందజేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్‌ ఆస్తులను తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ సంస్థ భూముల్లో ఉన్న చెట్లను అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.

➡️