- సిఐడి అఫిడవిట్ దాఖలు
ప్రజాశక్తి-అమరావతి : సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న పలువురు పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని సిఐడి పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఐపిఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీస్ అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. వీళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసే చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే వీరు సాక్షులపై ఒత్తిడి చేసే ప్రమాదం ఉంటుందన్నారు. విద్యాసాగర్‌తో చేతులు కలిపి కుట్ర చేశారన్నారు. ఆ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు కూడా భాగస్వామి అన్నారు. విద్యాసాగర్‌తో కలిసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని చెప్పారు. ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు కూడా బెయిల్ ఇవ్వొద్దని మరో కౌంటర్ దాఖలు చేశారు. ఈ మేరకు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్‌పి సరిత కౌంటర్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు డిసెంబరు 2న విచారణ చేయనుంది.