ముందుకెళ్తే ప్రతిఘటన తప్పదు : ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పంట కాలువల నిర్వహణ ప్రైవేట్‌కు ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని, అలా కాకుండా ముందుకెళ్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని ఎపి రైతు సంఘం హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ జలవనరులశాఖ నిర్వహణలో సమర్ధత లేకపోతే సమర్ధతను ఎలా పెంచుకోవాలో ఆలోచన చేయాలే తప్ప కాలువల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనే ఆలోచనను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూముల ప్రైవేటీకరణ, రహదారుల ప్రైవేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అంటూ అన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలనే ఆలోచన కొత్తది కాదని, గతంలో ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో చంద్రబాబు పాలన 1996-2004 కాలంలోనే ఇది ముందుకు వచ్చిందని అన్నారు. అప్పట్లోనే అది విఫల ప్రయత్నంగా రుజువైందన్నారు. గోదావరి-బనకచర్ల కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆ కార్పొరేషన్ ద్వారా రుణాల రూపంలో నిధులు సమీకరిస్తామని చెప్పడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కార్పొరేషన్ల పేరుతో ఏకంగా లక్షల కోట్లు అప్పు చేశారో తిరిగి అదే బాటలో చంద్రబాబు పయనిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
