ఓట్‌ కార్డుతో ఆధార్‌ లింక్‌ చేయొద్దు

Mar 27,2025 00:00 #Aadhaar, #ap cpm, #Do not link, #voter card
  • ఎన్నికల సంఘం సమావేశంలో సిపిఎం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ.. ఎన్నికల సంఘానికి తెలిపింది. ఎన్నికల నిర్వహణపై రాజకీయ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ బుధవారం సచివాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సిపిఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె జయరాం హాజరై పలు సూచనలు చేశారు. ఓటు కార్డుతో ఆధార్‌ కార్డు లింక్‌ చేయడం సరికాదని, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అడ్డుకునేందుకు పోలింగ్‌కు మూడు రోజుల ముందు యుపిఐ చెల్లింపులపై నిఘా పెట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో పార్టీలు, అభ్యర్థులు, నాయకులపై అసత్యాలతో కూడిన దుష్ప్రచారం జరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా వీలైనన్ని పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొండలు ఎక్కి చాలా దూరం ప్రయాణించి ఓటు వేయాల్సి వస్తుందని, అవసరమైన రవాణా, తిండి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒకే ఇంట్లో ఉండే వారందరికీ ఒకే పోలింగ్‌ బూత్‌ ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటింగ్‌ యంత్రాలు వివిపిఎటిలను 50 శాతం కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఎన్నికల మెటీరియల్‌ పంపడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పార్శిల్‌ సర్వీసుల్లో అనుమతించడం లేదని, దీనివల్ల చిన్న పార్టీల ప్రచారానికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. కాబట్టి అన్ని పార్శిల్‌ సర్వీసుల్లో అనుమతించాలని కోరారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలుపుదల చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ పోలింగ్‌ రోజు పత్రిక, సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో పెద్దయెత్తున ప్రకటనలు వస్తున్నాయన్నారు. అలాకాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

➡️