- బహిరంగ సభలో వి శ్రీనివాసరావు పిలుపు
- సిపిఎం నెల్లూరు జిల్లా మహాసభ ఘనంగా ప్రారంభం
- ఇందుకూరుపేటలో భారీ ర్యాలీ
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో 16 వేల కోట్ల రూపాయల భారం మోపిందని, విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ప్రజలు తిరగబడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా 25వ మహాసభ ఇందుకూరుపేటలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఎస్‌ఎస్ కల్యాణ మండపం నుంచి షాదీ మంజిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలపై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచాయని వివరించారు. అదానీకి ఆదాయం సమకూర్చేలా స్మార్ట్ మీటర్ల్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, దీన్ని ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. ప్రపంచం మారుతోందని, ప్రజల గుండెల్లో ఎర్రజెండా నిలుస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇటీవల కొందరు… కమ్యూనిస్టులు ఎక్కడ అని అడుగుతున్నారని, మన పొరుగు దేశం, ప్రపంచంలో ఎర్ర జెండా ఎలా ప్రజల హృదయాల్లో నిలిచిందో వారు చూడాలన్నారు. కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పుంజుకుంటున్నాయని, ప్రసుత్త పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయని తెలిపారు. శ్రీలంకలో ఐదేళ్ల క్రితం కేవలం మూడు శాతం ఓట్లు, మూడు సీట్లు ఉండేవని, ఇప్పుడు 56 శాతం ఓట్లు, 217 సీట్లతో దేశ అధ్యక్ష పదవి ఎర్ర జెండాకు దక్కిందని వివరించారు. కమ్యూనిస్టు దేశం ఉత్తర కొరియా స్ఫూర్తితో దక్షిణ కొరియా ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. ఆ దేశ అధ్యక్షుడు పారిపోయారని తెలిపారు. పెట్టుబడిదారీ దేశాలు సంక్షోభంలో మునిగిపోయాయని వివరించారు. కమ్యూనిస్టు దేశమైన చైనాను చూసి అమెరికా బయపడుతోందని తెలిపారు. మన దేశ సంపదను అదానీ కొల్లగొడుతుంటే ఇతర పార్టీలు మాట్లాడడం లేదని, ఒక్క కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ప్రతిఘటిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వానికి రూ.1,750 కోట్లు లంచం ఇచ్చి అదానీ తనకు అనుకూలంగా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు, జగన్ మోహన్‌రెడ్డి కలిసిపోయారని, అందుకే విద్యుత్ కొనుగోలు కుంభకోణంలో కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు. నిన్నటి వరకు విమర్శించుకున్న ఇద్దరు నేతలూ ఇప్పుడు సఖ్యతగా ఉన్నారన్నారు. మోడీ ఈ ఇద్దరి నేతలనూ కలిపి నడిపిస్తున్నారని, గత ఐదేళ్లూ మోడీ చెప్పినట్లు జగన్ విన్నారని, ఇప్పుడు చంద్రబాబు వింటున్నారని వివరించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో ముడుపుల విషయం బయటపడడంతో అదానీపై అమెరికా కేసు నమోదు చేసిందని, ప్రపంచ దేశాల ముందు భారత్‌ను తలదించుకునేలా చేసిన అదానీపై చర్యలు తీసుకోకుండా దేశ ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అదానీ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ మీటర్లను రూ.30 వేల చొప్పున కొనుగోలు చేశారని, ఈ భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపి పది సంవత్సరాలు వసూలు చేస్తారని తెలిపారు. స్మార్ట్ మీటర్లను పెట్టాలని ప్రజలు ఎవరూ అడగలేదన్నారు. స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని ఎన్నికల ముందు చెప్పిన టిడిపి, ఇప్పుడు ఆ మీటర్ల ఏర్పాటుకు పూనుకోవడం దారుణమన్నారు. గతంలోని వైసిపి ప్రభుత్వం రైతులను మోసగించిందన్నారు. అదే విధానాలను టిడిపి కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. సభకు ముందు పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామమైన విడవలూరు మండలం అలగానిపాడు గ్రామం నుంచి తీసుకొచ్చిన సుందరయ్య జ్యోతిని వి.శ్రీనివాసరావుకు సిపిఎం నాయకులు అందజేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టివివి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ వెంకమరాజు, గోగుల శ్రీనివాసులు, కె.అజరుకుమార్, తుళ్లూరు గోపాల్, మూలె వెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్‌ఎస్ కల్యాణ మండపం (సీతారాం ఏచూరి ప్రాంగణం)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది.