- స్మార్ట్ మీటర్ తీసేస్తాం
- ‘ప్రజాశక్తి’ కథనానికి ‘స్పందన’
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ‘పెద్దాయనా.. నీకు వచ్చిన కరెంట్ బిల్లు రూ.30,356 కట్టొద్దు.. యూనిట్లు చెక్‌చేసి, మరో బిల్లు ఇస్తాం. అప్పుడు ఎంత వస్తుందో అంతే కట్టు.. స్మార్ట్ మీటర్ తీసేస్తాం’ అని చంద్రాచారికి డిస్కం అధికారులు హామీ ఇచ్చారు. బుధవారం తెల్లవారుజామునే వారు ఆయన షాపు వద్దకు వచ్చారు. ఎడిఇ శంకరయ్య, పుత్తూరు డిఇ దేవ ఆశీర్వాదం, కుప్పంబాదూరు ఎఇ గిరిలతో పాటు మరో ఐదుగురు అధికారులు వచ్చారు. బుధవారం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం చుట్టుగుంట రామాపురం గ్రామానికి చెందిన వి.చంద్రాచారి షాపునకు అధికంగా బిల్లు వచ్చిన సంగతి తెలిసిందే. మీటర్ రీడింగ్ తీసిన వ్యక్తిని ఆ షాపు వద్దకు అధికారులు పిలిపించారు. ఆన్‌లైన్‌లో బిల్లు పంపించడం ఏంటి? ఎంత యూనిట్లు వాడారో ఒరిజినల్ బిల్లు చేతికి ఇవ్వాలి కదా? మీరు చేసిన తప్పిదానికి మేం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది? అంటూ కిందిస్థాయి ఉద్యోగులపై డిస్కం అధికారులు సీరియస్ అయ్యారు. ‘పేద వృత్తిదారుడికి స్మార్ట్ వాత’ అనే శీర్షికతో బుధవారం ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి డిస్కం అధికారులు పై విధంగా స్పందించారు. స్మార్ట్ మీటర్ తీసేస్తామని వినియోగదారుడికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ప్రజాశక్తి’తో ఎఇ గిరి మాట్లాడుతూ.. తాము మీటర్‌ను పరిశీలించామని, బిల్లింగ్ చేయడంలో పొరబాటు జరిగిందని, యూనిట్లు లెక్కించి చూస్తే రూ.1566 బిల్లు వచ్చిందని, సవరించి చంద్రాచారి వద్ద బిల్లు కట్టించుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.