- పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి
- రైతు రుణ విమోచన చట్టం అమలు చేయండి : వడ్డే శోభనాద్రీశ్వరరావు
ప్రజాశక్తి- గురటూరు జిల్లా ప్రతినిధి : వ్యవసాయ రంగాన్ని నిరీర్యం చేసే చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించాలని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, రూ.మూడు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు గుంటూరులోని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు అధ్యక్షత వహించారు. సభలో శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని, 65 శాతం ప్రజలు ఆధారపడిన ఈ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ రైతులు ఏడాదిన్నరపాటు చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, అంబాని, అదాని ఒత్తిడి మేరకు మళ్లీ మరో రూపంలో ఈ చట్టాలను అమలు చేయడానికి సన్నద్ధమవుతోందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలులో భాగంగా ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి కనీసం మద్దతు ధర నిర్ణయిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని రకాల పంటలకూ కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నారు. పంజాబ్‌లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేశారని, మన రాష్ట్రంలోనూ ఈ విధంగా చేయాలని కోరారు. కేరళ, తెలంగాణ, కర్ణాటకలో రైతులకు కనీసం మద్దతు ధర రాకపోతే ధాన్యానికి బోనస్ ఇస్తున్నారని, మన రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు రూ.14 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని తెలిపారు. 1990లో దేవీలాల్, 2008లో మన్మోహన్‌సింగ్ రైతులకు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో ఎటువంటి ప్రోత్సాహకాలూ ఇవ్వడం లేదన్నారు. మిర్చి ధర పడిపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని తెలిపారు. రెండు మూడు వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకోకుండా భారీ ప్రాజెక్టులు చేపట్టడం కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చడమేనని తెలిపారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాథాకృష్ణ, ఎపి రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య,, ఎపి రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, నాయకులు ముసలయ్య, కోకో రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు, వివిధ రైతు సంఘాల నాయకులు సిహెచ్.వెంకటేశ్వర్లు, చుండూరు రంగారావు, కొల్లా రాజమోహనరావు, ఎం.హరిబాబు, పి.జమలయ్య, వెంకటరెడ్డి, ఆంజనేయులు, ఎం.సూర్యనారాయణ. హనుమారెడ్డి, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ చిష్టి, మెడికల్ రిప్రజంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కుమార్, సలీం తదితరులు ప్రసంగించారు. ప్రజానాట్యమండలి కళాకారులు రైతుల సమస్యలపై పలు గీతాలను ఆలపించారు.