ప్రజాశక్తి – అనంతగిరి (అల్లూరి జిల్లా) : ‘సంక్రాంతికి చుక్కల్లాంటి రోడ్లు’ అని ప్రభుత్వం చెప్పిన మాటలు… ఆ పండగ వెళ్లి రెండు నెలలు కావొస్తున్నా ఆచరణకు నోచలేదు. ఏజెన్సీలోని నాన్ షెడ్యూల్డ్ గ్రామాల గిరిజనులకు నేటికీ కష్టాలు తప్పడం లేదు. అందుకు ఈ ఘటనే ఓ తార్కాణం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బూరిగ గ్రామానికి చెందిన బూరిగ మల్లమ్మ, చినకోనెల గ్రామానికి చెందిన సోమెల జోగయ్యలు పని నిమిత్తం విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లాల్సి ఉంది. వారిద్దరూ వృద్ధులు కావడంతో వారి కుటుంబ సభ్యులు డోలీ కట్టి వానిజ వరకూ తరలించి అక్కడి నుంచి ఆటోలో మెంటాడలోని బ్యాంకుకు తీసుకెళ్లారు. అనంతగిరి మండలంలోని నాన్ షెడ్యూల్ గ్రామాలైన రొంపల్లి, ఎన్‌ఆర్.పురం. కొండ శిఖరు గ్రామాలైన బూరిగ, చిన్నకోనెల, ఎన్.పురం పంచాయతీ పరిధి సిమిడివలస, భోంగిజ, రాయపాడు, డెంజనివలస గ్రామాల ప్రజలు ఆస్పత్రి, బ్యాంకు, వారపు సంత వంటి అవసరాలకు విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రానికి వెళ్తుంటారు. వారంతా కొండ శిఖరాల మీదుగా కాలినడకన వెళ్తూ నిత్యం అవస్థలు పడుతున్నారు.
డోలీ కష్టాలు వీరికి నిత్యకృత్య మయ్యాయి. మెంటాడ మండలం వానిజ గ్రామం నుంచి అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ చిన్నకోనెల, బూరిగ వరకు ఉపాధి హామీ చట్టం కింద రూ.మూడు కోట్లతో రోడ్డు మంజూరైనా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం తెలప డంతో పనులు నిలిచిపోయాయి. తక్షణమే ఆ పనులు పూర్తి చేయాలని ఆయా గ్రామాల నాయకులు సోమెల అప్పలరాజు, బి.పెంటయ్య డిమాండ్ చేశారు.
