దొడ్డిదారిన భారాలు మోపొద్దు

  • స్మార్ట్‌మీటర్లు బిగించొద్దు
  • బహిరంగ విచారణలో బాబూరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై దొడ్డిదారిన భారాలు మోపొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చేశారు. ఎపి ఇఆర్‌సి చైర్మన్‌ ఠాగూర్‌ రామ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ విచారణలో ఆయన మాట్లాడుతూ ట్రూఅప్‌, ఎఫ్‌పిపిసిఎ వంటి పేర్లతో డిస్కమ్‌లు వేలకోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని, అదే సమయంలో భారాలు మోపడం లేదంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నాయని అన్నారు. పాత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి నెల 40 పైసల విధానాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో 2 యూనిట్లు వాడిన వినియోగదారులకు రూ.910ల బిల్లు వచ్చిం దని బిల్లు ప్రతులను చూపించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ధరను 6 పైసలు నుంచి రూ.1కి పెంచారన్నారు. కేంద్రప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉద్యోగులకు వేతనాలు, బకాయిలు చెల్లించకుండా కార్పొరేట్లకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో తూర్పు, మధ్య, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు లేవని, కేవలం అదానీ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎపిడిసిఎల్‌) మాత్రమే ఉందని అన్నారు. ట్రూఅప్‌, ఎఫ్‌పిపిసిఎ విధానాలను రద్దు చేయాలని, సెకి ఒప్పందంపై విచారణ జరిపిం చాలని, స్మార్ట్‌ మీటర్లను రద్దు చేయాలని, ప్రజలకు విద్యుత్‌ రాయితీలను కొనసాగించాలని బాబురావు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ రంగ నిపుణులు ఎం వేణుగోపాల్‌ రావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ విధానాలను అనుసరించడం వల్ల ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే పునరుత్పాదక విద్యుత్‌ పేరుతో అవసరం లేకపోయినా డిస్కమ్‌లు ప్రైవేట్‌ కంపెనీల నుంచి ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. 2025-26లో కూడా డిస్కమ్‌లు ప్రతిపాదించిన దానికంటే మిగులు విద్యుత్‌ ఉంటుందన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్లు ఆ పనిచేయడం లేదన్నారు. విద్యుత్‌రంగ నిపుణులు పున్నారావు మాట్లాడుతూ విద్యుత్‌ భారాలు వల్ల ఉత్తరాంధ్రలో ఫెర్రోఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతపడి 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 160 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్‌ఇ) వస్తే వినియోగదారుల కష్టాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పగటిపూట థర్మల్‌ ఉత్పత్తి తగ్గించడం వల్ల యూనిట్‌ ధర పెరగడంతోపాటు ప్లాంట్లు త్వరగా మరమ్మతులకు గురవుతాయని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి నిరసనగా రైతు సంఘం నాయకులు సిహెచ్‌ వేణుగోపాల్‌రావు తలకిందులుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు డిస్కంల ప్రతిపాదనలను ఆయా సిఎండిలు కె సంతోషరావు (ఎపిఎస్‌పిడిసిఎల్‌), రవి సుభాష్‌పట్టాన్‌శెట్టి (ఎపిసిపిడిసిఎల్‌) ఐ పృధ్వీతేజ్‌ (ఎపిఇపిడిసిఎల్‌) చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎపిఇఆర్‌సి సభ్యులు వెంకటరామిరెడ్డి, కార్యదర్శి పి కృష్ణ, ట్రాన్స్‌కో జెఎండి కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు.

➡️