మైనింగ్‌ పేరిట కొండను ధ్వంసం చేయొద్దు

Aug 17,2024 22:24 #Don't destroy, #hill, #mining
  • కుసులవాడలో రెండో రోజూ కొనసాగిన సిపిఎం పాదయాత్ర

ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) : విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీకి ఆనుకొని ఉన్న కొండకు సంబంధించి మైనింగ్‌ అనుమతులను రద్దు చేయాలని, ఈ నెల 28న అధికారులు తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌ చేశారు. మైనింగ్‌తో వాటిల్లే నష్టాలను తెలియజేస్తూ పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్ర శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. కుసులవాడ ఎస్‌సి కాలనీ, గొల్లలపాలెం బిసి కాలనీ, దాసరి వీధి, కుసులవాడ ప్రాంతాల్లో ఈ పాదయాత్ర సాగింది. నాయకులు కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్యవంతం చేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ మైనింగ్‌తో కుసులవాడ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల పంటలకూ నష్టం వాటిల్లనుందని తెలిపారు. భూగర్భ జలాలు, చెరువులు, బోర్లు కలుషితమవుతాయన్నారు. ప్రజలు కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్‌ బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ భీమిలి జోన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ మైనింగ్‌ అనుమతులు రద్దు చేయకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జోన్‌ కమిటీ సభ్యులు రవ్వ నర్సింగరావు, ఎస్‌.అప్పలనాయుడు, వాళ్ల నాగరాజు, పి.సూర్యనారాయణ, కొయ్య గౌరి పాల్గొన్నారు.

➡️