ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెమిడియల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం సరైంది కాదని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి తెలిపారు. ఏప్రిల్ 23న విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత చెంది మంచి ఫలితాలు సాధించారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తీర్ణులు కాని 18.86 శాతం పిల్లల కోసం ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షలకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉత్తీర్ణులు కాని పిల్లల కోసం రెమిడియల్ తరగతుల పేరుతో ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయుల వేసవి సెలవులను నిరోధించడమేనని పేర్కొన్నారు. ఇతర ఉద్యోగులులా కాకుండా ఉపాధ్యాయులు వెకేషన్ శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు. మండు వేసవిలో ఉపాధ్యాయులను వేధించొద్దని, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజును కోరారు.
నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు : ఎపిటిఎఫ్
వేసవి సెలవుల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు యథాతథంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసిందని ఎపిటిఎఫ్ తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ చిరంజీవి, జి హృదయరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ఆదివారం, సెలవు రోజుల్లో కూడా యథాతథంగా పనిచేయాలని, మధ్యాహ్న భోజనం, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ సదుపాయాలు కల్పించాలని ఇచ్చిన మార్గదర్శకాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. పదో తరగతి విద్యార్థులను ఉత్తీర్ణులు చేసేందుకు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛంధంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
వేసవి తరగతులు మార్చాలి : టిఎన్‌యుఎస్
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత కోసం తరగతులు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వులను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. తరగతులు ఉదయం 8 నుంచి 11.30లోపు ముగించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.