- టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన వైసిపి నేతలు
- పాసుపోర్టులు అప్పగించిన లేళ్ల, తలశిల, అవినాష్, జోగి
ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : తెలియదు. తాము దాడి జరిగిన రోజు లేము. గుర్తుకు రావడం లేదు’ అని మంగళగిరి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన వైసిపి నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సమాధానం చెప్పినట్టు తెలిసింది. అప్పటి సిఎం జగన్‌ను విమర్శించినందుకు కొంతమంది కార్యకర్తలు టిడిపి ఆఫీసుపై దాడి చేసినట్టు తెలుసునని, తాము ఎప్పుడు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనలేదని విచారణలో ముగ్గురు నేతలు వెల్లడించినట్టు సమచారం. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పొందిన వైసిపి నాయకులకు మంగళగిరి రూరల్ పోలీసులు 41ఏ కింద విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వీరు శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో విచారణకు వచ్చారు. రాత్రి 8.45 వరకు విచారణ కొనసాగింది. కోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురు నేతలు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించారు. దాడి ఘటనపై ముగ్గురిని వేర్వేరుగా విచారణకు పిలిచారు. నిందితుల తరపున విజయవాడ న్యాయవాది బొగ్గు గవాస్కర్ హాజరయ్యారు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా ముగ్గురు కలసి కారులో వెళ్లిపోయారు. వీరి వెంట మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఉన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీమంత్రి జోగి రమేష్ కూడా విచారణకు హాజరు అయ్యారు. జిల్లా అదనపు ఎస్‌పి కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి డిఎస్‌పి మురళీకృష్ణ వీరిని విచారించారు. విచారణ సందర్భంగా మంగళగిరిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.