- కేంద్రీకృత సోలార్ ప్లాంట్లతో నష్టాలు
- కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి ఇఎఎస్ శర్మ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందాలు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ప్రైవేట్ కంపెనీలతో సోలార్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల వినియోగదారులపై భారాలు పడుతున్నాయని తెలిపారు. కేంద్రీకృత సోలార్ ప్లాంట్లు సాంకేతికత లేకపోవడం వల్ల భారీ ప్రసార నష్టాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇందుకు ఉదాహరణ అమెరికాలోని మోజావే ఎడారిలో ప్రారంభించిన ప్లాంట్ అని లేఖలో వివరించారు. అమెరికాలో జరిగిన ఇలాంటి కుంభకోణం త్వరలో దేశంలో కూడా వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. ఉపయోగంలో లేని సౌర ఉత్పత్తి సాంకేతికతల కోసం కార్పొరేట్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎ) చేసుకోవాలని డిస్కంలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయన్నారు. దీనివల్ల ప్లాంట్లు త్వరగా పాడవడంతో గ్రిడ్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టమని పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులపై భారీగా భారం పడుతుందని తెలిపారు. మరోవైపు థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అయ్యే భూమి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఈ ప్లాంట్లు ఆక్రమిస్తాయని వివరించారు. గుజరాత్‌లోని ఖావ్డా ప్రాంతంలో అదానీ గ్రూప్ ప్లాంట్ 538 చదరపు కిలోమీటర్లలో విస్తరించిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ప్లాంట్లకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీటికి ప్రభుత్వ ఖర్చుతో రాయితీ ధరలకు భూమి, నీరు ఇస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర పన్ను మినహాయింపులు, రాయితీలతోపాటు, ప్రత్యక్ష సబ్సిడీలు ఇస్తున్నాయని అన్నారు. అదాని గ్రూపుతోపాటు అజూర్ కంపెనీకి రాయితీలతోపాటు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా ప్రత్యక్ష సబ్సిడీలు ఇచ్చిందని ఉదాహరించారు. ప్రైవేట్‌కు అప్పగించే కేంద్రీకృత ప్లాంట్ల కంటే వినియోగదారులే వారి ప్రాంతంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినియోగదారులు తక్కువ ఖర్చుతో తమ సొంత ప్రాంతంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి, అదనంగా ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉందన్నారు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించొచ్చని తెలిపారు.