చంద్రబాబు మెడికల్‌ రిపోర్టులపై అనుమానాలు : సజ్జల రామకృష్ణారెడ్డి

Doubts-on-Chandrababu%27s-medical-report-Sajjala

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అనారోగ్య సమస్యలపై కండీషన్‌ బెయిల్‌పై బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడుకు ఇస్తున్న మెడికల్‌ రిపోర్టులు పలు రకాల అనుమానాలను పెంచేలా వున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ప్రైవేటు ఆస్పత్రులు ఇస్తున్న మెడికల్‌ రిపోర్లును పరిశీలిస్తే ఆ బెయిల్‌పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. గుండె సంబంధిత ఇబ్బందులుంటే వెంటనే స్టంట్‌ వేయడం గానీ, బైపాస్‌ సర్జరీ చేయడం గానీ చేస్తారని, అలా కాకుండా అంబులెన్స్‌ను వెంటపెట్టుకుని బయట తిరగాలని వైద్యులు రిపోర్టు ఇచ్చారంటే వాటిపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. కేన్సర్‌ వంటి రోగం ఉందో లేదో పరీక్షలు చేయాలని రిపోర్టు రాయటం ఏమిటని ప్రశ్నించారు. జైలులో ఉన్నంతసేపు ప్రాణాంతక వ్యాధులున్నట్టు ప్రచారం చేసుకుని బెయిల్‌ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారన్నారు. మెడికల్‌ రిపోర్టు ఇచ్చింది వైద్యులా? లేక రాజకీయ నేతలా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నా.. బయట ఉన్నా.. తమకేమీ ఇబ్బంది లేదన్నారు.

➡️